chapter 50

శ్రీ సాయి సత్ చరిత్రము
ఏబదియవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 50

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏబదియవ అధ్యాయము

1. కాకాసాహెబు దీక్షిత్ 2. టెంబెస్వామి 3. బాలారామ్ ధురంధర్ కథలు.

సత్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తముగూడ నదియే కనుక. సత్ చరిత్రలోని 51వ అధ్యాయ మిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

తొలిపలుకు

భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయీ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందనవృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంతఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగ జేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.

కాకాసాహెబు దీక్షిత్ (1864 - 1926)

మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణకుటుంబములో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమికవిద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంతన్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావ్లాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ ను జూచెను. ఇద్దరును కలిసియేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో, అతడు సద్గురువగు సాయివద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్ గాం కు మామలతుదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్ నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించు కొనెను. మిరీకర్ తండ్రీకొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనాయని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. ఆహమద్ నగరులో నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు షాన్షె, అప్పాసాహెబు గద్రేయు శ్యామాను గలిసి, మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని షిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మీరీకరులవద్దకు పోయెను. వారు శ్యామాకు కాకా సాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాం కు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబాయొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు శిరీడీకి పోయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై యద్దముపగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరులవద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాలద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండుక్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుంటబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్ గాం లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకా సాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అత డానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబావల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో "అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి యే బాధయు లేక, యెట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను.

శ్రీ టెంబె స్వామి

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువ వద్దని వేడుము. నాయందు ప్రేమ చూపు మనుము." ఆయన, స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును షిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబావలె రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒకనెల పిమ్మట పుండలీకరావు తదితరులును షిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బొయిరి. పరిగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టముకొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది. షిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయ మప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహంచెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని, తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు, పశ్చాత్తాపపడుచు, బాబాను క్షమాపణ వేడెను. దానికి బదు లింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవు దింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా యిట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొనవేల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును." ఎంత చక్కని వేదాంతవిషయము బాబా బోధించెనో చూడుడు!

బాలారామ్ ధురంధర్ (1878 - 1925)

బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రుజులో పఠారెప్రభుజాతికి చెందిన బాలారామ్ ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, భగవత్చింతన గలవారు. బాలారామ్ తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై యొక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపురవిఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా యిట్లు చెప్పెను. "ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు." ధురంధరసోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని, విస్మయమొందిరి. తక్కినవారందరు బాబాకు సాష్ఠాంగనమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని యుండిరి. బాబా వారితో నిట్లనెను. "వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని." బాబా ధురంధర సోదరులతో నిట్లనెను. "గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము". సోదరులందరు వినయవిధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి, బాబాపాదములవైపు దృష్టినిగడించిరి. సాత్వికభావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట, మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారంద రానందించిరి. భొజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారామ్ బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటుపడియుండలేదు. అయినప్పటికి దాని నందుకొని కష్షముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగ నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను.

వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడియుత్సవమును జూచుభాగ్యము ధురంధరసోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు తేజో కాంతిని పాండురంగవిఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

బాలారామ్ ధురంధర్ మరాఠీ భాషలో తుకారామ్ జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఏబదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।