chapter 48

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదియెనిమదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 48

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియెనిమదవ అధ్యాయము

భక్తుల ఆపదలు బాపుట

1. షేవడే 2. సపత్నేకరుల కథలు

ఈ అధ్యాయము ప్రారంభించునప్పు డెవరో హేమడ్ పంతును "బాబా గురువా? లేక సద్గురువా?" యని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు.

సద్గురుని లక్షణములు

ఎవరు మనకు వేదవేదాంతములను, షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవితపరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపరసుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు జేసెదరో యెవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తకజ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడ పొంది యున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యుల కెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందయినను శిష్యులనుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్యలక్షణమేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకు గాని చెందరు, తమ పాండిత్యమునకు వారు గర్వించరు, ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.

హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను. బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, స్నేహితులుగాని, యిల్లుగాని, ఎట్టి యాధారముగాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగి యుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతికశరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధిచెందిన పిమ్మటకూడ తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన - భక్తివిశ్వాసములనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దానియెదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేని యెడల చదువుటగాని, వినుటగాని, నేర్చుకొనుటగాని నిష్పలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనినిగూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ; అదే మోక్షమునకు మార్గము.

ఈ యధ్యాయములో చెప్పవలసిన ముఖ్యకథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుద కతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథవలన విశదపడును.

షేవడే

షోలాపూర్ జిల్లా అక్కల్ కోట నివాసి సపత్నేకర్ న్యాయపరీక్షకు చదువుచుండెను. తోడి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడ గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరములవలన షేవడేకు ఏమియురానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడ నగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను. సాయిబాబా యెవరు? వారినేల యంత పొగడుచున్నావు? అని అడిగెను. అందులకు షేవడే యిట్లనెను. "షిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులితరులున్నను, వారమోఘమైనవారు. పూర్వజన్మసుకృతముంటేనే గాని, మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్షయందుత్తీర్ణుడనయ్యెద"ననెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని, బాబాను కూడ వెక్కిరించెను.

సపత్నేకరు - భార్యాభర్తలు

సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను. పది సంవత్సరముల పిమ్మట అనగా, 1913లో వానికి గల యొకేకుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికల మయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థముపోయి, శాంతి పొందవలె ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు, వేదాంతము చదివెను గాని, యదికూడ సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు, అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తానుకూడ షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరమునుండియే బాబా దర్శనముచేసి సంతసించెను. గొప్పభక్తితో బాబావద్దకేగి యొకటెంకాయ నచట బెట్టి, బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసెను. "బయటకు పొమ్ము" అని బాబా యరచెను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి యచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహాయైన తీసికొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబావద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి యదెవరిదని యడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వయిపు చూసెను. బాబా నవ్వగా నచటివారందరు నవ్విరి. బాలా ఆ నవ్వుయెక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను. సపత్నేకరుకేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబాముందు కూర్చుండిరి. మసీదు ఖాళీచేయమని బాబా సపత్నేకర్ ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జెందిరి. బాబా యాజ్ఞను పాలించవలసి యుండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసివచ్చెను. ఇంకొకసారి వచ్చినపుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను.

సపత్నేకర్ భార్య

ఒక సంవత్సరము గడచెను. కాని, యతని మనస్సు శాంతి పొందకుండెను. గాణగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను; తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము గనపడెను. స్వప్నములో నామె నీళ్ళకొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను. అచట నొక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట కూర్చున్న వారు తనవద్దకు వచ్చి "ఓ అమ్మాయి! అనవసరముగా శ్రమపడెదవేల? నేను స్వచ్ఛజలముతో నీకుండ నింపెదను" అనెను. ఆమె పకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని యిద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను. వారు లెండీతోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియు లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు, అచటనే కూరచుండెను. ఆమె యణకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో నొక కథ చెప్పుటకు మొదలిడెను. "నా చేతులు, పొత్తి కడుపు, నడుము, చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేకౌషధములు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని. కాని నొప్పులన్నియు నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని" అనెను. పేరు చెప్పనప్పటికి ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో పోవుటచే నామె సంతసించెను.

సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను. మరల బాబా బయటకు బొమ్మనెను. ఈ సారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి, దాని విరుగుడుకొరకు ప్రయత్నించుచుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యొనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదాములపై బెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపయి బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కుర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటిగూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములన్నియు వర్ణించెను. అందులో వాని యొకేయొక కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే యని సపత్నేకర్ మిక్కిలి యాశ్చర్యపడెను. బాబాకు తన విషయము లన్నియు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ యాలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూపించి యిట్లనెను. "వీడు తనకొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల? అదే బిడ్డను వీనిభార్య గర్భములోనికి మరల దెచ్చెదను." ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చియిట్లనియె. "ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును." సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను.

సపత్నేకర్ పూజాసామగ్రినమర్చుకొనినైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారివద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివారు. ప్రజలు మసీదులో గుమిగూడి యుండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమవినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను.

ఆ మరుసటిదిన మింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక యివ్వచ్చునని సపత్నేకర్ యనుకొనెను. మసీదుకు బోయి ఒక రూపాయి దక్షిణ నివ్వగా బాబా యింకొక రూపాయ కూడ నడిగెను. బాబా వానిని ఆశీర్వదించి యిట్లనెను. "టెంకాయను దీసికొనుము. నీ భార్య చీరకొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి యాందోళనము నుంచకుము" అతడట్లే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి, ఆ శిశువును బాబా పాదములపై బెట్టి యిట్లు ప్రార్థించిరి. "ఓ సాయీ! నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగనమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించ వలసినది. ఇక మీదట మేము మీ పాదములనే మాశ్రయించెదముగాక. అనేకాలోచనలు, సంగతులు, స్వప్నావస్థలోను, జాగ్రదవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము."

కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ యను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడ నమ్మిరి.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియెనిమదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।