chapter 45

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదియైదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 45

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

(7వ రోజు పారాయణ - బుధవారము)

నలుబదియైదవ అధ్యాయము

1. కాకాసాహెబు సంశయము 2. ఆనందరావు దృశ్యము 3. కఱ్ఱబల్ల మంచము బాబాదే - భక్త మహళ్సాపతిది కాదు.

తొలిపలుకు

గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారిభౌతికశరీరము మన దృష్టినుండి నిష్క్రమించెను, గాని వారి యనంత స్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియేయుండును. ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్తలీలలు జరుగుచున్నవి. దీనినిబట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందక ముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు ఇప్పుడుకూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కినవారిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినచో, దానిని మనః పూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను.

పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుగుకొని మనమే ప్రయాణము సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధినమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరుపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. ఇదియే అద్వైతభజనము లేదా పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల, గురువు నామమును జపించుట వలనను, వారి స్వరుపమునే మనమున నుంచుకొని ధ్యానించుటచేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మన కది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును.

కాకాసాహబు సంశయము - ఆనందరావు దృశ్యము

కాకాసాహబుదీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధిచెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథభాగవతము చదువుచుండెను. శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను. అందు వృషభకుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్ హోత్ర, దృమిళ, ఛమస్, మరియు కరభజన్ లు భాగవతధర్మసూత్రములను జనకమహరాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడగెను. వారొక్కొక్కరు సంతృప్తి కరమైన సమాధానము లిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవతధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్ హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశ మేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామాతో నిట్లనియె. "నవనాథులు భక్తివిషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది? దాని నాచరించుట యెంత కష్టము? నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మ లెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చునెట్లు? కాబట్టి యట్టిదానిని మనమాచరించరాదని తెలియుచున్నది." కాకా సాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను. "ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు చిరాకు చెందనేల? నవనాథుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని, ఆందోళనకుగాని యవకాశ మేది?" కాకాసాహెబు శ్యామా చెప్పిన సమాధానముతో సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.

ఆనందరావు సాఖాడే యనువాడు శ్యామాను వెదుకుచు పురాణకాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువు చుండెను. సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్నదృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణకాలక్షేపమునకు కొంచెమాటంకము గలుగజేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను. "నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధాన మిదిగో! బాబా సాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. "రక్షకమైన భక్తి" వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కిచెప్పియున్నారు." అందరు ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కొరిక ప్రకారము సాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్ప నారంభించెను.

లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని, అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని యనుకోలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచి యుండెను. శ్యామా "ఆనందరావు! బాబా పాదములపై బడుము" అని సలహా నిచ్చెను. "నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది, కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను" అని నేనంటిని. అది విని యతడు బాబాతో నిట్లనెను. "ఓ దేవా! నీటిలో నున్న నీ పాదములను బయటకు దీయుము." వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసెను. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. "ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు."

బాబా యాజ్ఞానుసారము సాఖాడేపట్టుదోవతిని తెచ్చెను. మాథవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామా యందుల కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను. సంశయవిషయములందు చీటివేసి సంశయమును దీర్చు కొనుట కాకాసాహెబు స్వభావము. 'పుచ్చుకొనుము', 'నిరాకరించుము' అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకలవద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. 'పుచ్చుకొనుము' అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. కాకాసాహెబు సంశయము తీరెను.

ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కథప్రబోథించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తివిశ్వాసము లుండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగా తెలిసియుండును. నీ హృదయఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల, హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్యశరాణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.

కఱ్ఱబల్ల మంచము బాబాదే, మహళ్సాపతిది కాదు

బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పుగల కఱ్ఱబల్ల మీద నాలుగు చివరలకు నాలుగు దీపపు ప్రమీదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇదివిని యతడు బాబా కిట్లనియె. "మీ కింకను కఱ్ఱబల్లయందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడ వేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును." అందుకు బాబా ఇట్లనెను. "మహళ్సాపతిని దిగువ విడిచి నే నొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు." కాకాసాహెబు ఇట్లనెను. "మహళ్సాపతికొరకింకొక బల్లను తయారు చేయించెదను." బాబా "అత డెట్లు బల్లపై పరుండగలడు. బల్లమీద అంత ఎత్తున పండుకొనుట సులభమయిన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది వీలగును. నేను నిద్రపోవునపుడు, మహళ్సాపతిని నా ప్రక్కన కుర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటినుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టు మనెదను. దీనినే యతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతిబరువును గమనించి, ఓ భక్తా! అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలును. ఎవడయితే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండ యుండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్లమీద నెట్లు పండుకొనగలడు?" అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచేనిట్లనెను. "మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియైదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।