chapter 29

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదితొమ్మిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 29

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదితొమ్మిదవ అధ్యాయము

1. మద్రాసు భజన సమాజము, 2. తెండుల్కర్ (తండ్రి - కొడుకులు), 3. డాక్టర్ హాటే, 4. వామన నార్వేకర్ మొదలైన వారి కథలు.

ఈ యధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి

1. మద్రాసు భజనసమాజము

1916వ సంవత్సరమున రామదాసి-పంథాకు చెందిన మదరాసు భజన సమాజ మొకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో నొక పురుషుడు అతని భార్య, అతని కొమార్తె, అతని వదినెయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహమదు నగరు జిల్లా, కోపర్ గాం తాలూకాలో షిరిడీ యను గ్రామమున సాయియను నొక గొప్ప యోగీశ్వరు డున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమానికి ఒక రూపాయి, రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలును, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి, యచట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను. మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో ముగ్గురు పేరాస గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుచుండగా, బాబా యామె భక్తివిశ్వాసములకు ప్రీతి జెంది యామె యిష్టదైవముయొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరామునివలె గాన్పించెను. తన యిష్టదైవమును జూచి యామె మనస్సు కరిగెను. ఆమె కండ్లనుండి యానందబాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె యానందవైఖరికి తక్కినవా రాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. జరిగిన దంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితి ననెను. ఆమె అమాయిక భక్తురాలగుటచే, శ్రీరాముని జూచుట, ఆమె పడిన భ్రమ యని భర్త యనుకొనెను. అది యంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా ఆమె శ్రీరాముని జూచుట యసంభవమనెను. ఆమె యా యాక్షేపణకు కోపగించ లేదు. ఆమెకు శ్రీరామదర్శనము అపుడపుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునపుడు, దురాశలు లేనపుడును, లభించుచునే యుండెను.

ఆశ్చర్యకరమైన దర్శనము

ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకొక యద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, యొక పంజరమున బంధించిరి. పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి, విచారముగా నత డిట్లనెను. "నీ కీర్తి విని, నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచట నిలచి యుండగా, ఈయాపద నాపయి బడనేల?". బాబా యిట్లనెను. "నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను." అతడిట్లనెను. "ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు." బాబా యిటులనెను, "ఈ జన్మములో కాకున్న గతజన్మములో నేమయిన పాపము చేసియుండ వచ్చును." అతడిట్లనెను. "గతజన్మములో యేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని నేల నిప్పుముందర యెండుగడ్డివలె దహనము చేయరాదు?" బాబా "నీ కట్టి విశ్వాసము గలదా?" యని యడుగ అతడు 'కలదు' అనెను. బాబా యప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు పడిపోయి యుండిరి. తాను బంధవిముక్తుడై యుండెను. అతడు మిక్కిలి భయపడి బాబావైపు జూచెను. బాబా యిట్లనెను. "ఇప్పుడు నీవు బాగుగ పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు." అప్పుడతడు ఇటుల విన్నవించెను. "నీవు తప్ప రక్షించేవా రెవరునులేరు. నన్ను ఎటులయిన కాపాడుము." అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లుచేసి, తిరిగి తెరచునంతలో, వాడు పంజరమునుండి విడుదలయినట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను. బాబా యిట్లనెను, "ఈ నమస్కారములకు ఇంతకుముందటి నమస్కారముల కైమైన భేదము కలదా? బాగా యాలోచించి చెప్పుము." అతడు ఇట్లనెను. "కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును, నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడుచేయుచుంటివని యనుకొనెడి వాడను." బాబా "నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?" యని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా "నీ యింటిలో పంజా లేదా? నీవు మోహర మప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ యింటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పు డామెను మీరు శాంతింప జేయుట లేదా?" యనెను. అతడు దీనికంతటికి యొప్పుకొనెను. అపుడు బాబా యిటులనెను. "నీకింక ఏమి కావలెను?" అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా యనెను. వెనుకకు తిరుగగనే యతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే, రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస గలవాడై యతడు బాబాతో యిటులనెను. "మీరు వృద్ధులుగా గనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియునా?" బాబా, "నేను ముసలివాడ ననచున్నావా? నాతో పరుగెత్తి చూడు" ఇట్లనుచు బాబా పరుగిడ మొదలిడెను. అతడు కూడ వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్రనుండి మేల్కొనెను.

మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటుపిమ్మట వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని, యందుగల ప్రశ్నోత్తరములు చాల ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి యుదయమందరు మసీదులో హారతికొరకు గుమి గూడి యుండగా అతనికి బాబా రెండురూపాయల విలువగల మిఠాయిని, రెండురూపాయల నగదు నిచ్చి ఆశీర్వదించెను. అతని మరికొన్నిరోజు లుండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి యిట్లనియె. "అల్లా నీకు కావలసినంత డబ్బు నిచ్చును. నీకు మేలు చేయును." అతని కచ్చట యెక్కువ ధనము దొరుకలేదు, కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా యాశీర్వాదము. తరువాత ఆ భజనసమాజమున కెంతో ధనము లభించెను. వారి యాత్రకూడ జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా ఇల్లుచేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి.

తన భక్తులను వృద్ధిచేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూపుట కీ కథ యదాహరణము. ఇప్పటికి నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు.

2. తెండూల్కర్ కుటుంబము

బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరు బాబాయందు భక్తి కలిగియుండిరి. సావిత్రీబాయి తెండూల్కర్, 'శ్రీ సాయినాథ భజనమాల' యను మరాఠీ గ్రంథమును 800 ఆభంగములు, పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీల లన్నియు వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబా తెండుల్కర్ వైద్యపరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లుచేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్నిదినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను. ఇది విని బాబా యామె కిట్లనెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లోకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము." తల్లి యింటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను; పరీక్షకు కూర్చొనెను. వ్రాతపరీక్షలో బాగుగ వ్రాసెను గాని, సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటిపరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడాయెననియు, నోటిపరీక్షకు రావలెననియు ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము వినియాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.

ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబయిలో నొక విదేశకంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పని చేయలేక సెలవుపెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవుకాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను; లేదా ఉద్యోగమునుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగవిరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలాకాలము తమవద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలె ననునది యాలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు, కుటుంబ ఖర్చులకు సరిపోదు. కాబట్టి యీ విషయమై వారందరు ఆతురుతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15రోజులు ముందు బాబా తెండూల్కర్ భార్యకు స్వప్నములో గనిపించి, "100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును. అది నీకు సంతృప్తికరమా?" యనెను. ఆమె యిట్లు జవాబిచ్చెను. "బాబా, నన్నేల యడిగెదవు? మేము నిన్నే విశ్వసించి యున్నాము." బాబా 100 రూపాయలు అనినను, అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు.

3. కాప్టెన్ హాటే

కాప్టెన్ హాటే బికానేరులో నుండువాడు. అతడు బాబాకు కూర్చుభక్తుడు. ఒకనాడు బాబా యతని స్వప్నములో గనిపించి 'నన్ను మరచితివా?' యనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని "బిడ్డ తల్లిని మరచినచో, అదెట్లు బ్రతుకును?" అనుచు తోటలోనికి బోయి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయం పాకమును, దక్షిణను బాబా కర్పింప నుండగా, నతడు మేల్కొనెను. ఇదియంతయు స్వప్నమనుకొనెను. కొన్నిదినములతరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడనుండి 12 రూపాయలు మనియార్డరుద్వారా తన స్నేహితునకు బంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలెనని, వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని, చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి యొక స్త్రీ తలపై చిక్కుడు కాయల గంపను పెట్టుకొని వచ్చెను. చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కాప్టెన్ హాటె పక్షమున దానిని బాబాకు అర్పించిరి. నిమోంకరు మరుసటిదినము అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని, చిక్కుడు కాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితునిద్వారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను.

పవిత్రము చేసిన రూపాయి

ఇంకొకసారి హాటేకు తన యింటిలో బాబా తాకి పవిత్రమొనర్చిన రూపాయి నుంచవలెనని కోరిక గలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురు దక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసికొనెను. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా, బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పైకెగురవేసి యాడి ఆ స్నేహితున కిట్లనెను. "దీనిని దాని యజమానికి ఊదీప్రసాదముతో కూడ ఇచ్చివేయుము. నాకేమి యక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండు మనుము." ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టిజెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనః పూర్వకముగా కోరుటచే బాబా తనకోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతసించెను.

4. వామన నార్వేకర్

చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి నొకప్రక్క సీతారామలక్ష్మణులును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబా కిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్చి ఊదీ ప్రసాదముతో తన కివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసి కొనెను. శ్యామా, నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు, దానిని తిరగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా యిట్లనెను. "దీని నేల అతని కివ్వవలెను? దీనిని మనమే యుంచుకొందుము. అతడు 25 రూపాయ లిచ్చినచో, తిరిగి వానిది వాని కిచ్చెదము." ఆ రూపయికొరకు, వామనరావు 25రూపాయలు వసూలుచేసి, బాబా ముందర బెట్టెను. బాబా యిట్లనెను. "ఆ నాణేము విలువ 25 రూపాయల కెంతో హెచ్చైనది. శ్యామా! యీ రూపాయిని దీసికొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ మందిరములో బెట్టి పూజించుము." బాబా యెందులకీ మార్గము నవలంబించిరో యడుగుట కెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో వారికే తెలియును.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|