chapter 27

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదియేడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 27

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియేడవ అధ్యాయము

భాగవతము విష్ణుసహస్రనామముల నిచ్చి అనుగ్రహించుట

1. దీక్షిత్ గారికి విఠల్ దర్శనము 2. గీతారహస్యము 3. ఖాపర్డే దంపతులు

బాబా మతగ్రంథములను తాకి పవిత్రముచేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి యీ ఆధ్యాయములో చెప్పుకొందుము.

ప్రస్తావన

మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానముచేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగ జేయునట్టి శ్రీ సాయిమహారాజునకు జయమగు గాక. ఓ సాయీ! నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీకథలను చదువువారును, వినువారును, మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విను నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక; వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక; వారి ప్రాణములు స్థిరపడుగాక; వారి మనస్సులు ఏకాగ్రమగుగాక; వారికి గగుర్పాటు కలుగుగాక; వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక; వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో, గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకశరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.

గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట

ముందుటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను జూచితిమి. అందులో నొక్కదానినే యీ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసినపిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు. ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను. శ్యామా యా పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని దీసికొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి, శ్యామాకిచ్చి దానిని తనవద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు, నందుచే దానినాతని కిచ్చివేయవలెననియు శ్యామా చెప్పెను. కాని బాబా "దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు" ననిరి. ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగనమస్కారముతో స్వీకరించెను.

శ్యామా విష్ణుసహస్రనామముల పుస్తకము

శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణుసహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి (రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతి రోజు ఉదయమే లేచి, ముఖము కడుగుకొని, స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి విభూతి పూసికొని, విష్ణుసహస్రనామమును (భగవద్గీతకు తరువాత ముఖ్యమైనది), ఆధ్యాత్మరామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అత డీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి, విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసికొననిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు పోయి యా మందును తీసికొని రమ్మనియు కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకమును దీసికొనెను. తమ స్థలమునకు తిరిగివచ్చి యిట్లనెను. "ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని, నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును." శ్యామా తన కాపుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు. మొండివాడు, కోపిష్ఠి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికు డగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను.

తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయు చున్నాడని శ్యామా యనుకొనెనే గాని బాబా తనకు మేలు కలుగ జేయనున్నాడని యనుకొనలేదు. బాబా యా సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరకుడయినప్పిటికి బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకార మతనిని ప్రపంచబాధలనుండి తప్పించగోరెను. భగవన్నామఫలిత మందరికి విశదమే. సకలపాపములనుండి దురాలోచనలనుండి, చావుపుట్టుకలనుండి అది మనలను తప్పించును. దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దాని కెట్టి తంతు కూడ అవసరము లేదు. దానికి నియమము లేమియు లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచేదాని నభ్యసింప చేయవలెనని బాబాకు దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగనే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణుసహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధి కొక విశాలమయిన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను.

రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించణీకర్ యక్కడనే యుండెను. నారదునివలె నటించి జరిగిన దంతయు వానికి జెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపయి బడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసికొనెనని యనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. "ఓ రామదాసీ! యేమి సమాచారము? ఎందులకు చీకాకుపడుచున్నావు? శ్యామా మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు? ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయచుంటివి గాని, యింకను నీ మనస్సు నపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా? సమస్తవిషయములందు నీవు నిర్మముడవుగా నుండవలెను. నీ వాపుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందు ననుకొంటిని. అందుచే దాని నతని కిచ్చితిని."

బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా అమృత తుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీత యను గ్రంథమును శ్యామా వద్ద తీసికొనెదననెను. శ్యామా మిక్కిలి సంతసించెను. "ఒక్కటేల? పది పుస్తకముల నిచ్చెద" ననెను.

ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను? మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయముయొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణఫలితము, విష్ణుసహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగ శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీ మాన్ బుట్టీ అల్లుడగు జి. జి. నార్కేకు బోధించ గలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి ప్రిన్సిపాలుగా నుండెను.

గీతా రహస్యము

బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపుసాహెబుజోగ్ కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్య ముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పు డది క్రిందపడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను ద్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు "దీనిని పూర్తిగ చదువుము, నీకు మేలు కలుగును." అనెను.

ఖాపర్డే దంపతులు

ఖాపర్డే వృత్తాంతముతో నీ యధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదా సాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్పవక్త. కాని బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము ఖాపర్డే, నూల్కర్, బుట్టీ - నిశ్శబ్దముగా కూర్చుండువారు, వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు, నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదా సాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని, యతని భార్య 7 మాసము లుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్డే గారి భార్య బాబాయందు భక్తిశ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతి రోజు 12 గంటలకు బాబాకొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజనసమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరీ, అన్నము, వులుసు, వరమాన్నము మొదలగునవి మసీదుకు దెచ్చెను. గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన స్థలములో గూర్చుండి, యామెతెచ్చిన పళ్ళెము పయి యాకు దీసి త్వరగా తిన నారంభించెను. శ్యామా యిట్లడిగెను. "ఎందు కీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వాని వైపు చూడనయిన చూడవు కాని, దానిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజన మెందు కంత రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది". బాబా యిట్లు బోధించెను. "ఈ భోజనము యథార్థముగా మిక్కిలి యమూల్యమయినది. గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటనుండి నిష్క్రమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక క్షత్రియుని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసికొననిండు." ఇట్లనుచు బాబా యామె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు, తిరిగి తన గద్దెపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను, బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామెచేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురుశిష్యులు బండొరులు సేవచేసికొనుట జూచి శ్యామా యిటులనెను. "చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది." ఆమె యథార్థమయిన ప్రేమకు సంతసించి, బాబా మెల్లగా, మృదువయిన యాకర్షించు కంఠముతో 'రాజారామ్' యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనుచు నిట్లనియెను. "నీవిట్లు చేసినచో, నీ జీవతాశయమును పొందెదవు. నీ మసస్సు శాంతించును. నీకు మేలగును." ఆధ్యాత్మికము తెలియనివారికి, ఇది సామాన్యవిషయమువలె గాన్పించును. కాని యది యట్లుగాదు. అది శక్తిపాతము. అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబాయొక్క మాటలెంత బలమయినవి! ఎంత ఫలవంతమయినవి! ఒకక్షణములో నవి యామెహృదయమును ప్రవేశించి, స్థిరపడెను.

ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించు చున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్ద రొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట, బాహ్యదృశ్యమేగాని, యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య బేధము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియేడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|