chapter 23

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదిమూడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 23

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదిమూడవ అధ్యాయము

(నాలుగువదినము పారాయణము – ఆదివారము)

యోగము – ఉల్లిపాయ

1. శ్యామా పాముకాటు బాగగుట. 2. కలరా నియమముల నుల్లంఘించుట. 3. గురుభక్తి పరీక్ష

ప్రస్తావన

నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సత్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గ మొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమ మయమగు భక్తి. గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను.

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతారపురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో దేనిలోనయిన పోటి పడెడి వారుకారు. తనకొరకేమైన చేయుమని యితరులను కోరెడి వారు కారు. సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుట గాని వారెరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని గాంచు చుండెడివారు. ‘నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.

మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన పుణ్యమేమైన యున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరుగదు. ఇక నీ యధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము.

యోగము – ఉల్లిపాయ

ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కరుతో షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నియు చదివెను. తుదకు పఠంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని, యనుభవమేమియు లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను. సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన తట్టెను. “రుచిలేని రొట్టెను పచ్చియుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు?” సాయిబాబా యతని మనస్సున నున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లునియెను. “నానా! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తికలదో వారే దానిని తినవలెను.” ఇది విని, యోగి యాశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్యశరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి జెంది యానందించినవాడై బాబా ఊదీప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను.

పాముకాటునుండి శ్యామాను కాపాడుట

ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు, జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింప బడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి, వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారిదృష్టి యన్నిటికంటె గొప్పస్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితు లాతని విఠోబాగుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్ధీపితుడయి బాబా యిట్లునయె, “ఓరి పిరికి పురోహితుడా! యెక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు” మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. “పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము.” బాబా యిట్లుకోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయ మందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను, శ్యామా దగ్గరకుపోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. “భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్యాస ముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు.” ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా వలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము గాని, తీర్థము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి. ఎవరైన ఈ కథగాని యింక నితరకథలుగాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.

కలరా రోగము

ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభచేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన – 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యీ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి, కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందుల కయి వారికి కట్టె లవసరము. గనుక నిల్వచేయువారు. బాబా గృహమనగా మసీదు, ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కర్రలను తీసికొని పోవువారు. అందుకు బాబా యెప్పుడును గొణుగుకొన లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శళ్యత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణ వైరాగులై నప్పటికి, సాధారణగృహస్థులకు ఆదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనములతో నున్నప్పుడెవరో యొకమేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తివ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివయిపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చినపిదప, సాయిబాబా పీల్చి యితరుల కిచ్చెడివారు. మధ్యాహ్నభోజనసమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడేబాబా పోవునపుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేల యని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయివద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించు కొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను, కాని వాడలోనుండి త్వరగా రాలేదు. తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బాహ్మణకుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించుపనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలసిద్ధపడుచుండెనని యంద రాశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురు చూచుచుండెను. బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.” అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ‘ఆగు’ మనెను. “ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా?” యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియె. “నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మా కింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము.”

బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ‘తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ యధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు – 1. ఉత్తములు 2. మధ్యములు. 3. సాధారణులు.

గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకమువారు, అడుగడుగునకు తప్పులు చెయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు.

శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మికపరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసములను బంధించుటగాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధనలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవితపరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

వచ్చే అధ్యాయములో బాబా గారి హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందుము.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|