ఇరువదియొకటవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 21
ఓం
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ
సాయిబాబా
జీవిత చరిత్రము
ఇరువదియొకటవ అధ్యాయము
1. వి. హెచ్. ఠాకూరు 2. అనంతరావు పాటంకర్ 3. పండరీ పురము ప్లీడరు - వీరి కథలు.
ఈ అధ్యాయములో హేమడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బి.ఏ.అనంతరావు పాటంకర్ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, ఆధ్యాత్మికమార్గమునకు దారి చూపును.
ప్రస్తావన
సామాన్యముగ మన గతజన్మపుణ్యసముపార్జనమువలని యదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలాకాలము మేజిస్ట్రేటుగ నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేకమంది హిందువులు పారశీకులు, ఇతర మతస్థులుపోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూనుస్, హేమడ్ పంతును అనేకసార్లు పీరుమౌలానాను దర్శించుమని చెప్పెను. కాని ఏదో కారణముచేత అతడు చూడ లేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతనివంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి, శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.
యోగీశ్వరుల వ్వవస్థ
అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమంది యోగు లనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేకచోట్ల పని చెసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తిచేసెదరు. దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు.
వి.హెచ్.ఠాకూరుగారు (బి.ఏ.)
వీరు రెవన్యూశాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వేపార్టీతో వచ్చెను. అక్కడ ‘అప్ప’ యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆయోగి నిశ్చలదాసు రచించిన ‘విచార సాగర’ మను వేదాంతగ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. “ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చెసినచో నీకోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ వొక గొప్పయోగిని యదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తుమార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు.” ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతు పై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్ కు పెద్ద యుద్యోగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయనవలన సాయిబాబాగూర్చి యనేకసంగతులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటిదినమే నానాసాహెబు షిరిడీపోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడ రమ్మని యడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను. అంతకుముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతరస్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబావద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ యధ్యాత్మికమార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూ రొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండుచేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించ వలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. అప్పా చెప్పినదంతయు నిజమే కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి యాచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని యాశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞాన మాత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంతభాగ మాతడు చదివియుండెను, గాని యాచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును.
అనంతరావు పాటంకర్
పూనా పెద్దమనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ యను వాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టిచెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయి బడి, తగిన పూజచేసినపిమ్మట బాబాతో ఇట్లనెను. నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశపురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి యైనను కలుగుట లేదు. కనుక నా పుస్తకజ్ఞాన మంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానములేని నిరాడంబరభక్తులు నాకంటేమేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టివలనను నీ చమత్కారపు మాటలవలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతికథను ఈ విధముగ చెప్పెను.
తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ (నవ విధభక్తి)
ఒకనా డొకవర్తకు డిక్కడకు వచ్చెను. అతనిముందు ఆడగుఱ్ఱము లద్ధివేసెను. అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను.
ఈ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేశదామోదర్ వురఫ్ దాదాకేల్కరు నిట్లు అడిగెను. దీని వలన బాబా యుద్దేశమేమి, అతడిట్లు జవాబు ఇచ్చెను. నాకుగూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము, నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిది యుండల లద్ది యనగా నవవిధభక్తి. అవి యేవన-1.శ్రవణము అనగా వినుట 2. కీర్తనము అనగా ప్రార్థించుట 3. స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట 4. పాదసేవనము అనగా సాష్టాంగనమస్కారమొనర్చుట 5. అర్చనము అనగా పూజ 6. నమస్కారము అనగా వంగి నమస్కరించుట 7. దాస్యము అనగా సేవ 8. సఖ్యత్వము అనగా స్నేహము 9. ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట.
ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమునందు నమ్మక ముంచి నడచుకొనినయెడల భగవంతుడు సంతుష్టిజెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు అనగా జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట యనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయుభజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడ ననుకొనుము. లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలె నవవిధభక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలె నవవిధభక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము శాంతి కలుగును.
ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, గుఱ్ఱపు లద్ది తొమ్మిది ఉండలను ప్రోగుచేసితివా లేదా యని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రధమమున తనను బాబా యాశీర్వదించవలెననియు ప్రార్ధించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని యాశీర్వదించెను. ఇది విని పాటంకర్ యపరిమితానందభరితు డయ్యెను.
పండరీపురము ప్లీడరు
ఒక చిన్నకథతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురమునుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగనే దక్షిణ యిచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కొకమూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. ప్రజలెంత టక్కరులు. వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు. చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా. ఈ టోపి (మాట) ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి గూడ ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని, యెవ్వరికి చెప్పలేదు. వాడా లోనికి వచ్చిన పిమ్మట, ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను. బాబా చెప్పివదంతయు యథార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరిని, నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్ జడ్జియగు నూల్కర్ తన యారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతిగదిలో దీనిగూర్చి వివాదము జరిగెను. సబ్ జడ్జి బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయి బాబాను నిందించిరి. నేనుకూడ అందు కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనికమీదట ఎవరిని దుషించరాదు. ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసికొనరాదు.
షిరిడీ పండరీపురమునకు మూడు వందల మైళ్ళ దూరమున నున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు, వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్య మేదియు లేదు. దగ్గర నున్నవి, దూరముగనున్నవి ప్రతివస్తువుకూడ పగటికాంతివలె వారికి తేట తెల్లము. ఎవడయిన దూరముగా గాని, దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనినిబట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.
ఇది యెక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక.
సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము కూడ అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే.
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియొకటవ అధ్యాయము సంపూర్ణము.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।