chapter 13

Topic 62

శ్రీ సాయి సత్ చరిత్రము
పదమూడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 13

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

పదమూడవ అధ్యాయము

మరికొన్ని సాయిలీలలు, జబ్బులు నయమగుట, 1. భీమాజీపాటీలు 2. బాలాషింపీ 3. బాపుసాహెబు బుట్టీ 4. అళందిస్వామి 5. కాకా మహాజని 6. హార్దానివాసి దత్తోపంతు.

మాయయొక్క యనంతశక్తి

బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి వంతముగను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనెను "నేను ఫకీరయి నప్పటికి, యిల్లుగాని భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి ఒకేచోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరనగ దానికెంత? ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల ఆమె బారినుండి తప్పించుకొందురు." మాయాశక్తి గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తనభక్తుల మేలుకొరకు బాబా యేమి చేయుచున్నారో వినుడు. "ఎవరు అదృష్టవంతులో యెవరి పాపములు క్షీణించునో, వారు నాపూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరములేదు. భక్తి యున్నచోటనే నా నివాసము." బాబాకు పూర్తిగా శరణాగతులైనవారి క్షేమము కొరకు బాబా యేమి చేసెనో వినుడు.

భీమాజీ పాటీలు

పూనా జిల్లా, జున్నరు తాలుకా, నారాయణగాం గ్రామమందు భీమాజీపాటీలు 1909వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల యౌషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది "ఓ భగవంతుడా! నారాయణా! నాకిప్పుడు సహాయము చేయము." అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునపుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజి కూడ భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానా సాహెబు చాందోర్కరుతో సలహా చేయవలె ననుకొనెను. కావున వారికి తన జబ్బుయొక్క వివరములన్నియు దెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయ మడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీ పోపుట కేర్పాటు లన్నియు చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర బెట్టిరి. నానాసాహెబు శ్యామగూడ నచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగ జేసికొనుటకు బాబా యిష్టపడకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి. "ఆగుము, నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధ లున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను కాపాడెదరు."

ప్రతి యయిదు నిముషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్కసారియైన రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను. అది సదుపాయమైనదిగాని, యారోగ్యమయినదిగాని కాదు. కాని బాబా యాజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునపుడు బాబా రెండు స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్దబండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాల బాధ కలుగుచున్నట్లు జూచెను. స్వప్నములో పడిన ఈ బాధలతో చాల జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడప్పుడప్పుడు షిరిడీ వచ్చుచుండెను. బాబా వానికి జేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగనమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తులవద్దనుంచి యేమియు కాంక్షించెడువారు కారు. వారికి కావలసినదేమన, భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుటయు, మార్పులేని గట్టినమ్మకమును; భక్తియును. మహారాష్ట్రదేశములో నెలకొకసారిగాని పక్షమునకొసారిగాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట యలవాటు. కాని భీమాజీపాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను.

బాలాగణపతి షింపీ

బాలాగణపతి షింపీ యనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్నిరకముల యౌషధములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజన మయ్యెను. జ్వరము కొంచమైన తగ్గలేదు. షిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై బడెను. బాబా వానికి వింత విరుగుడు - లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని - చెప్పెను. దీనినెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను. రెండును కలిపి లక్ష్మీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక యాడించుకొనుచుండెను. పెరుగన్నము కుక్కముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను.

బాపు సాహెబు బుట్టీ

ఒకానొకప్పుడు బాపు సాహెబు బుట్టీ జిగట విరేచనములతోను వమనములతోను బాధపడుచుండెను. అతని అలమారు నిండ మంచి మందులుండెను. కాని యేమియు గుణమివ్వలేదు. విరేచనముల వల్లను, వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చొండబెట్టుకొని యిట్లనెను. 'జాగ్రత్త! నీవు విరేచనము చేయకూడదు' అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. 'వమనము కూడ ఆగవలెను' అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బుట్టీ జబ్బు కుదిరెను.

ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే యన్ని యౌషధములను ప్రయత్నించెను, కాని రోగము కుదరలేదు. అప్పుడు బాపు సాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ యౌషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి, జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి యిచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరయినను చెప్పును. కాని బాపు సాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను.

ఆళంది స్వామి

ఆళందినుండి యొక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను. వారు శస్త్రచికిత్సకూడ చేయించుకొనిరి. కాని వ్యాధి నయము కాలేదు. బాధ యెక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవు నప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని శ్యామా ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతని నిట్లు ఆశీర్వదించెను. "అల్లా అచ్ఛా కరేగా" (భగవంతుడు నీకు మేలు చేయును). స్వామి పూనా చేరెను. ఒక వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. చెవిపోటు తగ్గెను; కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబొయి వెళ్ళెను. డాక్టరు చెవి పరీక్షచేసి శస్త్రచికిత్స యనవసరమని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత యద్భుతమైనది.

కాకామహాజని

కాకామహాజని యను నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబునిండ నీళ్ళు పోసి మసీదులో నొకమూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబా కేమి చెప్పకే, బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపనచేయుటకు బాబా సమ్మతించెను; కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండ బెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్నసంచిని అచ్చట విడిచి పారి పోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్ర పరచుట, తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కూడ కొంతపప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొనిరమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్నినీళ్ళు త్రాగి, కాకాను కూడ త్రాగుమనెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును." అంతలో పారిపోయిన వారందరును వచ్చిరి. పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాకాకూడ వారితో కలిసెను. నీళ్ళవిరెచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్రము ప్రకారము వేరుశనగపప్పు విరెచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన యౌషధము బాబాయొక్క వాక్కు.

హార్దా నివాసి దత్తోపంతు

దత్తోపంతు హార్దాగ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ యౌషధము వానికి గుణము నివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసెదరను సంగతి తెలిసికొని షిరిడీకి పోయి, బాబా పాదములపై బడెను. బాబా అతనివైపు దాక్షిణ్యముతో చూచి యాశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తము నుంచగనే, ఊదీ ప్రసాదము, ఆశీర్వాదము చిక్కగనే యతనికి గుణమిచ్చెను. ఆ జబ్బువలన తిరిగి బాధ యెన్నడు లేకుండెను.

ఇంకొక మూడు వ్యాధులు

(1) మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనా ముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞలేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా యాశీర్వాదముతో నయమయ్యెను.

(2) కాకామహాజని యన్న గంగాధరపంతు అనేకసంవత్సరములు కడుపునొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపునొప్పి బాగుచేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగుచేయగలడనెను. అప్పటినుంచి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను.

(3) ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రియంతయు చికాకు పడెను. డాక్టర్లు ఇంజక్షనులు ఇచ్చిరి. కాని, యవి ఫలించలేదు. అప్పుడతడు బాబావద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను.

ఈ కథలన్నియు నిరూపించునదేమన; అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబాయొక్క వాక్కు, ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పదమూడవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।