chapter 42

Topic 42

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదిరెండవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 42

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదిరెండవ అధ్యాయము

బాబా సమాధిచెందుట

1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరి దశ.

ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము.

తొలిపలుకు

గత అధ్యాయములలో చెప్పిన కథలు, బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోలిపోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా విన వలెను. అది వారి మనస్సును పావనము చెయును.

ముందుగా సూచించుట

చదువరు లింతవరకు బాబా జీవితకథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండు మూడు దినము లుండెను, కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్చోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధుని లోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదియుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడ గడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి?" "ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది యెవరికి అర్ధము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి.

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట

ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధవడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని "నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచెసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా "నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యాకోతేపాటిలుగూర్చి సంశయించుచున్నాను. ఆతడు శక సం. 1840 విజయదశమినాడు (1918) మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు; వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికిని తెలియనీయలెదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్రపాటీలు, బాలాషింపియు, ఈ యిరువురు మాత్రమే తాత్యాగుర్చి భయపడుచుండిరి.

రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాటప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలే కుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను; బాబా శ్రీ హరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జను లనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యాపేరు తెలిపెను.

ఆ మరుసటి యుదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి, కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." షిరిడినుండి వచ్చిన ఉత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజనకీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందురోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

లక్ష్మీబాయి శిందేకు దానము

దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్నిదినములనుండి వారు వ్యాధి గ్రస్తులుగా నుండిరి, లోపలమాత్రము పూర్ణచైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధిచెందెదమని బాబాకు తెలియును. కాన, లక్ష్మీబాయి శిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి.

బాబా సర్వజీవవ్యాపి

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రిసమయమందు భక్త మహాళ్సాపతి, తాత్యా, లక్ష్మీ బాయి శిందే తప్ప తదితరులెవ్వరు, మసీదులో కాలుపెట్టుట కాజ్ఞలేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా యిట్లనెను, "ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది." వెంటనే యామె లేచి "కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెదను" అని అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి బాబా! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి." అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు.

బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తమ భౌతిక శరీరమును విడుచునపుడు, తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధభక్తులను తెలియజేసెను. లేదా ఇది సిమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరములేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధమందు దశమాధ్యాయములో ఆరవశ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె యెన్నటికిని మరువదు.

మిక్కిలి జాగురూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా అవసానకాలమందు కూడ జాగ్రత్త పడెను. తన భక్తుల పై గల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపుసాహెబు బుట్టీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడువలేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పొయిరి. బాబా స్థితి యపాయకరముగా నుండెనని వారికి దెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చిండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తిచేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు మసీదుకు పరుగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలి యుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।