+91 9440000588 info@shrishirdisaisociety.org 8.00 AM to 6.00 PM
SHRI SHIRDI SAI & GNANA SARASWATHI Spiritual & Service Society · Gorantla, Guntur
D.No.11-86, Sri Venkateswara Colony, Estate Post,
Gorantla-522034, Guntur Rural Mandal, Andhra Pradesh, India
Home Nitya Parayanam Chapter 26

Sai Satcharitra — Chapter 26

Nitya Parayanam

Sai Satcharitra — Chapter 26

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదియారవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 26

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియారవ అధ్యాయము

1. భక్తపంతు, 2. హరిశ్చంద్ర పితళే, 3. గోపాల అంబాడేకర్.

ప్రస్తావన

ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని, దండమునుకాని చూచి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బహ్యమునకు అగుపడునట్లు గాన్పించును గాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధి యను అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి.

ఆంతరిక పూజ

హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందబాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్త్వికభావము లనెడు ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును, ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.”

ఇకనీ అధ్యాయములోని కథలవైపు మరలుదము.

భక్త పంతు

ఒకనాడు పంతు అను భక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇచ్ఛలేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. బి.వి & సి.ఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరు షిరిడీకి పోవుచుండిరి. వారందరు తమ వెంట రమ్మని కోరగా వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్ లో దిగెను. అచట తన గురువును దర్శించి, షిరిడీ పోవుటకు అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందిరితో కలసి షిరిడీకి వచ్చెను. ఉదయమే షిరిడీ చేరిరి. 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపునకు జూచి యందరు సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్ళు చల్లగా తెలివి వచ్చెను. నిద్రనుండి లేచిన వానివలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా, యింకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను. "ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితళే

బొంబాయిలో హరిశ్చంద్ర పితళే యను వారుండిరి. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడ వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపయి బడుట యనే సాధన మొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కనికీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసెనని వింటిమి. 1910లో పితళే అట్టి కథలు కొన్నిటిని వినెను. వానినుండి, యితరులు చెప్పినదానినుండి, బాబా తన దృష్టిచేతను, తాకుటచేతను, బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యమును దప్పి నేలపైబడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వానివలె పడెను. దీనిని జూచి తల్లి దండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని యీ మూర్ఛ చాలసేపటివర కుండెను. తల్లి కంటినీరు వరదలుగా కారు చుండెను. ఆమె యేడ్చుటకు మొదలిడెను. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి పరుగెత్తగా అది తన నెత్తిపయి బడినట్లు, పులికి భయపడి పారి పోయి కసాయివాని చేతిలో పడిన యావువలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారి పయిబడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను.

ఆమె యిటు లేడ్చుచుండగా బాబా యామెనిటుల యోదార్చెను. "ఇటు లేడ్వవలదు, కొంతసే పాగుము. ఓపికతో నుండుము. కుర్రవానిని బసకు దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము పచ్చును." బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యదార్ధము లయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే, కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయము లన్నియు దీరెను. పితళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. "నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్ల బడినవా? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును." పితళే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితళే భార్య సాత్వికురాలు. నిరాడంబరము, ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టి నిగిడ్చి కండ్లనుండి యానందభాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబావద్ద సుఖముగా నున్నపిమ్మట ఇంటికి పోవనిశ్చయించి, బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితళేను దగ్గరకు బిలచి యిట్లనెను. "బాపూ, అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని. ఇప్పుడు 3 రూపాయ లిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు." పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసి యాశీర్వచనములకయి ప్రార్థించెను. ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనుక, అంతకుముందు 2 రూపాలయిలిచ్చెనను బాబా మాటల యర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలితల్లికి ఈవృత్తాంతమంతయు చెప్పి బాబాయంతకు ముందు రెండురూపాయలిచ్చెననెను; అదేమియని యడిగెను. ఆమె తన పుత్రున కిట్లనెను. నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు, మీతండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీతండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపు మనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ వదృష్టవంతుడ వగుటచే, అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పింప జూచుచున్నారు. కాబట్టి యికమీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము నవలంబింపుము. కుటుంబదైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని, యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలుకొరకు దాని నభివృద్ధి చేసికొనుము" తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయియొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాల జాగ్రత్తగా నుండెను.

అంబాడేకర్ గారు

పూనానివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఆబ్ కారి డిపార్టుమెంటులో 10సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా జిల్లాలో, జౌహర్ స్టేట్ లోను వారుద్యోగములను జేసి, విరమించు కొనిరి. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి, కాని ఫలించలేదు. ఆతడనేకకష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తనకష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో నతని స్థితి చాల హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండిమీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను బిలచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా? యని యడుగుచు పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. "అక్కల్ కోట కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను. బాధను సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ యనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి, బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాల మేల నీకర్మ ననుభవించరాదు? గత జన్మముల పాపముల నేల తుడిచివేయ రాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."

సమయోచితమైన ఈ కథను చదివి, అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా యీప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును, దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతనికిగల భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకుకూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధిపొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దానిద్యారా తన పరిస్థితి బాగుచేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగత జీవితమంతయు సుఖముగా గడిపెను.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

Om Sai Ram