+91 9440000588 info@shrishirdisaisociety.org 8.00 AM to 6.00 PM
SHRI SHIRDI SAI & GNANA SARASWATHI Spiritual & Service Society · Gorantla, Guntur
D.No.11-86, Sri Venkateswara Colony, Estate Post,
Gorantla-522034, Guntur Rural Mandal, Andhra Pradesh, India
Home Nitya Parayanam Chapter 14

Sai Satcharitra — Chapter 14

Nitya Parayanam

Sai Satcharitra — Chapter 14

Topic 63

శ్రీ సాయి సత్ చరిత్రము
పదునాలుగవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 14

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

పదునాలుగవ అధ్యాయము

నాందేడ్ నివాసియగు రతన్ జీ వాడియా, మౌలానాసాహెబు అను యోగి; దక్షిణమీమాంస.

గత అధ్యాయములో బాబాయెక్క వాక్కు, ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యరోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్ జీ వాడియా యనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము.

ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడ మధురముగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు, అన్నియు మధురముగా నుండును. వారి జీవితము ఆనందమున కవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరు హాయిగా నుండవలెనని బాబా యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదంచవలెనని వారి యుద్దేశము. గతజన్మల పుణ్యముకొలది మనకు మన జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక, మన మెప్పుడును బద్ధకించరాదు. ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును, మోక్షమును సంపాదించవలెను.

ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడ గలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగినయెడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు.

నాందేడు పట్టణ నివాసియగు రతన్ జీ

ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించెదము. నైజాం యిలాకాలోని నాందేడులో ఫార్సీవర్తకు డొకడుండెను. అతని పేరు రతన్ జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగు జేసెను. పొలములు, తోటలు, సంపాదించెను. పశువులు, బండ్లు, గుఱ్ఱములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాల సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడువాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు గాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు. ధనికుడగు రతన్ జీ గూడ ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు. దానధర్మములు చేయువాడు; బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు. అందరి కన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరును "అతడు మంచివాడు; సంతోషముగ నున్నా" డని యనుకొనసాగిరి. కాని రతన్ జీ చాల కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియై యుండెను. భక్తిలేని హరికథవలె, వరుసలేని సంగీతమువలె, జంధ్యములేని బ్రాహ్మణునివలె, ప్రపంచజ్ఞానములేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపములేని యాత్రవలె, కంఠాభరణములేని యలంకారమువలె రతన్ జీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనముగాను, అందవికారముగాను, నుండెను. రతన్ జీ యెల్లప్పుడు ఈ విషయమునుగూర్చియే చింతించుచుండెను.

రతన్ జీ తనలో తానిట్లనుకొనెను. "భగవంతు డెన్నడయిన సంతుష్టి జెంది పుత్రసంతానము కలుగ జేయడా?" మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా? లేదా? యను నాతురతతో నుండువాడు. దాసుగణు మహారాజు నందు గొప్పగౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు వారిని గాంచి, తన మనస్సులోని కోరికను జెప్పెను. షిరిడీ వెళ్లుమని వానికి దాసుగణు సలహా నిచ్చెను; బాబాను దర్శించు మనెను; బాబా ఆశీర్వాదము పొందుమనెను; సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్ జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేనెను. బాబా పాదములమీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి, యొక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను; మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను.

"కష్టదశలో నున్నవారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని, కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము." బాబా రతన్ జీ ఇవ్వదలచిన 5 రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను. అందులో 3రూపాయల 14పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను, గాని మిగిలిన 1రూపాయి 2పైసలు మాత్రమే యిమ్మనెను. ఇది విని రతన్ జీ గ్రహించుకొనలేక పోయెను. కాని బాబా పాదములవద్ద కూర్చుండి మిగత దక్షిణ యిచ్చెను. తాను వచ్చిన పని యంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానము కలుగజేయుమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. "చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు" నని చెప్పెను.

బాబావద్ద సెలవు పుచ్చుకొని రతన్ జీ నాందేడు వచ్చెను. దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించెననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని యనియెను. బాబా అంతకముందే 3రూపాయల 14పైసలు ముట్టినవని యనెను. బాబా యాడిన మాటల కర్థమేమని దాసుగణు నడిగెను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే! నావల్ల బాబాకు 3రూపాయల 14పైసలు ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడ సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాల మయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబు వారికి 3రూపాయల 14పైసలు తో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే యీ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు 3రూపాయల 14పైసలు యగుట జూచి యందరు ఆశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో మౌలానా సాహెబు కిచ్చిన 3రూపాయల 14పైసలు సంగతి బాబా కెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే యని గ్రహించిరి.

రతన్ జీ యా సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితిలేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12గుదురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి.

ఈ యధ్యాయము చివరన హరివినాయక సాఠె యను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్రసంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చినపిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి. కావున నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికి అసత్యములు గానేరవు. మూడవసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంత నతడు మిక్కిలి సంతుష్టి చెందెను.

దక్షిణ మీమాంస

దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్లిన వారినుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట యందరికి తెలిసిన సంగతే. బాబా ఫకీరయినచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని యెవరైన అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధాన మిది.

మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గివుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులనుగాని తదితరులను గాని బాబా యేమియు నడిగెడివారు కారు. ఎవరైనా నొకటి కాణి గాని రెండు కాణులు గాని యిచ్చినచో దానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని చిలుముగాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాణి యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడి వారు. అర్థణా అయినచో తిరిగి యిచ్చేవారు. బాబాగారి కీర్తి యన్నిదిశలకు వ్యాపించినతరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను.

"దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు" అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగులపూజలోమాత్రమేల యుండరాదు? శాస్త్రములలో గూడ నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు 'ద' యను నక్షరమును బోధించెను. ఈ అక్షరమువల్ల దేవతలు 'దమము' నవలంబించవలెనని గ్రహించిరి. (అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట). మానవులు ఈ యక్షరమును 'దానము' గా గ్రహించిరి. రాక్షసులు దీనిని 'దయ' యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమ మేర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించ వలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణుకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానముగూర్చి బోధించుటకు, ధనమందు వారికిగల అభిమానమును పోగొట్టుటకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక యుదాహరణము. గణపతిరావు బోడన్ యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు, దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడన్ కు దొరుకుచుండెను.

దక్షిణ యడుగగా ధనమీయ నక్కరలేదను నర్థము గూడ పెక్కు సంఘటనలవలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండుదాహరణములు.

(1) బాబా 15రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి.నార్కే నడుగగా, నతడు తనవద్ద దమ్మిడీయయిన లేదనెను. బాబా యిట్లనెను. "నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు. దానినుంచి నాకు దక్షిణ యిమ్ము." దక్షిణ యనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే యర్థము. (2) ఇంకొకసారి బాబా, తరఖడ్ భార్యను 6రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను. ఆమెవద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త యక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్థము జెప్పెను. ఆమె యొక్క యారుగురు శత్రువులను (కామ క్రోధ లోభాదులు) బాబాకు పూర్తిగ సమర్పించవలెనని యర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను.

బాబా దక్షిణరూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి యుదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణరూపముగా పుచ్చుకొనినను బాబా మహా సమాధి పొందు నప్పటికి 9రూపాయలు మాత్రమే వారిచెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణపుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుటకొఱకే.

దక్షిణగూర్చి యింకొకరి వర్ణన

బి.వి. దేవ్ ఠాణానివాసి; ఉద్యోగము విరమించుకొనిన మామలతుదారు, బాబా భక్తుడు, దక్షిణగూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు.

బాబా యందరిని దక్షిణ యడుగువారు కారు. అడుగకుండ ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొక్కప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తులవద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో యిచ్చెదమనుకొను వారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడి వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైన తమ ముందుంచినచో దానిని తీసికొని పొమ్మనుచుండిరి. బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్నమొత్తములుగాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టి యుండును. స్త్రీలు, పిల్లలవద్ద కూడ బాబా దక్షిణ యడుగుచుండెను. వారు, అందరు ధనికులనుగాని అందరు బీదలనుగాని దక్షిణ యడుగలేదు.

అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు. ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో, వారు దానిని మరచునప్పుడు, వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, దక్షిణము పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగియిచ్చి, పూజలో పెట్టుకొని పూజించు మనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్న దానికంటె నెక్కువ యిచ్చినచో, కావలసినదానినే యుంచుకొని మిగతాదానిని తిరిగి యిచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనినదానికంటె నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని, అడిగిగాని ఇవ్వుమనుచుండెను. కొందరివద్దనుంచి యొకరోజు మూడు నాలుగుసారులు దక్షిణ కోరుచుండెను.

దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి కొంచెముమాత్రమే చిలుమునకు, ధునికొరకు ఖర్చుపెట్టుచుండెను. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చియిచ్చిరి. ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి యంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలుగ్లాసు మాత్రమే యనియు అయినప్పటికి భక్తు లనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను.

మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది స్త్రీ రెండవది ధనము. షిరిడీలో బాబా యీ రెండు సంస్థలను నియమించి యున్నారు. అందొకటి దక్షిణ; రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు, ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ యడిగి పుచ్చుకొని, "బడికి" (రాధాకృష్ణమాయి గృహము) పంపుచుండెను. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు, కాంతయందు ఆభిమానము పోయనదని నిరూపించినపుడే బాబా దయవలన ఆశీర్వాదమువలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను.

భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైనస్థలమందు పవిత్రునకిచ్చిన దానము, ఆదాతయొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది. షిరిడీకన్న పవిత్రస్థలమేది? అందున్న దైవము సాయిబాబాకన్న మిన్న యెవరు?

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Om Sai Ram